|| Telangana is the only state where farmer suicides have decreased || – కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక నేత కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు పార్లమెంట్ వేదికగా బీజేపీ ప్రభుత్వం స్వయంగా ప్రకటించిందని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు – ప్రపంచ రికార్డు
కేటీఆర్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కేసీఆర్ నిర్మించారని తెలిపారు. శివుడు గంగమ్మ తల్లిని దివి నుంచి గుడికి తీసుకురాగా, కేసీఆర్ గోదావరి జలాలను 80 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి కొండపోచమ్మ సాగర్‌ను నింపారని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టులపై దుష్ప్రచారం – విపక్షాల వైఖరిపై విమర్శలు
కాళేశ్వరం బ్యారేజిల్లో 340 పిల్లర్లలో ఒకటి పగిలితే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తోందని, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగినా బీజేపీ నోరుమెదపడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంలా మారారని, ఇది ప్రజలకు అర్థమైపోతుందని కేటీఆర్ అన్నారు.
రాహుల్-రేవంత్ ట్యాక్స్, తెలంగాణ అప్పులపై స్పందన
తెలంగాణ ప్రజల నుంచి వసూలైన డబ్బు రాహుల్ గాంధీకి టకీ టకీమని వెళ్లిపోతుందని ఆరోపించిన కేటీఆర్, కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు, విద్యుత్ రంగ పునరుద్ధరణ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగాయని గుర్తుచేశారు. కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, రేవంత్‌ను చూసిన తర్వాతే కేసీఆర్ విలువ ప్రజలకు తెలుస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.