అమరావతి, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఒకప్పుడు వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన విద్యాశాఖ ఇప్పుడు సంస్కరణలతో ముందుకు సాగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన చర్యలు నిలుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా మార్పులు తీసుకురావడంతో ఈసారి ఫలితాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించింది.ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలు గత 12 ఏళ్లలోనే అత్యుత్తమంగా నమోదయ్యాయి. మొదటి సంవత్సరంలో 77 శాతం, రెండో సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఫలితాలు మెరుగుపడి, మొదటి సంవత్సరంలో 66 శాతం, రెండో సంవత్సరంలో 76 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైస్కూల్ స్థాయిలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా విస్తరించడం జరిగింది. అదేవిధంగా ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, పోటీ పరీక్షల మెటీరియల్, సైన్స్ ప్రాక్టికల్ రికార్డులను విద్యార్థులకు అందించారు. ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయడంతో పాటు, బోధనా సిబ్బంది లోటును గెస్ట్ ఫ్యాకల్టీతో పూరించారు.పరీక్షల నిర్వహణలో కూడా మార్పులు తీసుకొచ్చారు. యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్‌లీ, ప్రీ-ఫైనల్ పరీక్షలను క్రమబద్ధంగా నిర్వహించి, ఫలితాలను డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా పర్యవేక్షించారు. విద్యార్థుల పనితీరును బట్టి ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించడం వంటి చర్యలు అమలులోకి వచ్చాయి.
‘సంకల్పం–2026’ పేరుతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేసి విద్యార్థులను A, B, C కేటగిరీలుగా విభజించి వారికి ప్రత్యేక శిక్షణ అందించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు, ప్రతి లెక్చరర్ కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుని వారి ప్రగతిని పర్యవేక్షించే విధానాన్ని ప్రవేశపెట్టారు.తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహించగా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా విద్యార్థుల ప్రగతిని తెలియజేశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సిలబస్ పురోగతిని పంచుకోవడం వంటి చర్యలు కూడా మంచి ఫలితాలను ఇచ్చాయి.ఈ చర్యలన్నింటి ఫలితంగా విద్యాశాఖలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. సమగ్ర ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ, సంస్కరణల అమలు ద్వారా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంలో ప్రభుత్వం ముందడుగు వేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
