మైలవరం, ఏప్రిల్ 15, (నేటి తెలుగు పత్రిక): పేదోడికి పట్టెడన్నం పెడుతున్న కూటమి ప్రభుత్వం.ఆకలితో ఎవ్వరూ అలమటించరాదన్నదే సీఎం చంద్రబాబు గారి ధ్యేయం.అన్నక్యాంటీన్కు రూ.5 లక్షల విరాళం.ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపేదోళ్లకు కూటమి ప్రభుత్వం పట్టెడన్నం పెడుతోందని, అన్నార్తుల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేస్తున్నారని, ఆకలితో ఎవ్వరూ అలమటించరాదన్నదే ఆయన ప్రధాన ధ్యేయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.మైలవరం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు బుధవారం ప్రారంభించారు. గ్రామస్తులు, కార్మికులు, నాయకులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. అన్నాక్యాంటీన్కు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు రూ.5లక్షల విరాళం ప్రకటించారు.మరో రూ.1 లక్షను చెక్కురూపంలో తెదేపా నేతల మిత్రుల బృందం సుకవాసి శ్రీహరి, ఈమని మురళీకృష్ణ, మన్నం వెంకట్రామయ్య చౌదరి, ధనేకుల శ్రీకాంత్ విరాళంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి అందజేశారు. తొలుత అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ “పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు మళ్లీ తెరచుకోవడంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే అన్నక్యాంటీన్ల వ్యవస్థను పునఃప్రారంభించింది.
పథకాలన్నింటిలో అన్నక్యాంటీన్ బృహత్తర పథకం. పేదలకు పట్టెడన్నం పెట్టాలనే అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు అన్నక్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పేదోళ్ల కడుపునింపే అన్నక్యాంటీన్లు తీసివేసి లెవెన్ రెడ్డి అయ్యాడు. అప్పట్లో వైసీపీలో ఎమ్మెల్యేగా తను ఉన్నప్పటికీ మైలవరంలో అన్నక్యాంటీన్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు. అప్పట్లో అన్నక్యాంటీన్ను ముందుండి నడిపించిన తెదేపా నేత ప్రస్తుతం ఏ.ఎం.సి డైరెక్టర్ చేబ్రోలు రాజుకు అభినందనలు. మైలవరం నియోజకవర్గంలో అత్యధిక జనసాంద్రత ఉన్న కొండపల్లి, జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలలో మరో రెండు అన్నక్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. దీనిపై సీఎం దృష్టికి తీసుకెళ్తాను.వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చేవారు, చిరు వ్యాపారులు, కార్మికులు, నిరుద్యోగులు, వలస కూలీలు ఇలా ఎందరో సంతృప్తిగా ఆహారాన్ని ఆరగిస్తున్నారు. గ్యాస్ ఇబ్బందులతో చిన్న హోటళ్లు ప్రస్తుతం తెరచుకోని పరిస్థితుల్లో ఎందరికో అన్న క్యాంటీన్లు అండగా నిలుస్తున్నాయి. కార్మికులు, కూలీలు, గ్రామీణులు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదు.
ఒక్కొక్కరికి మూడు పూటలా ఆహారం అందించేందుకు ఖర్చు రూ.90లు అవుతుండగా కేవలం రూ.15 వసూలు చేస్తూ మిగిలిన రూ.75 ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తోంది. ఒక్కో అన్న క్యాంటీన్‌లో సగటున రోజుకు 1,013 మంది చేసే భోజనాలకు రూ.26,250 ఖర్చు అవుతోంది. 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో మరింత మందికి ఆహారం అందుతుంది. రుచి, శుచితో పాటు నాణ్యతతో కూడిన ఆహారం అన్నక్యాంటీన్లలో అందుబాటులో ఉంటుంది.
అన్న క్యాంటీన్లలో మెనూ: ఇక్కడ ప్రతి రోజు ఉదయం కేవలం రూ.5లకే అల్పాహారంగా ఇడ్లీ, పూరి, ఉప్మా , పొంగల్ వీటిలో ఏదైనా ఒకటి అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి భోనాల్లో వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు పచ్చడి మెనూతో కేవలం రూ.5లకే వడ్డిస్తారు.అన్న క్యాంటీన్‌లో ఉదయం 7.30 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకు భోజనం, తిరిగి రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు రాత్రి పూట భోజనం అందిస్తారు.
ప్రతి క్యాంటీన్‌లో ఉదయం పూట అల్పాహారం 200 మంది, మధ్యాహ్నం 300 మంది, రాత్రి పూట 300 మంది భోజనం చేయవచ్చు.” అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

