ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: భూదానోద్యమం అందించిన సమానత్వం, సామాజిక న్యాయం స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో భూదానోద్యమం 75వ వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూదానోద్యమ ప్రముఖుడు వెదిరే రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, దానాల్లో భూదానం అత్యంత గొప్పదని పేర్కొన్నారు. భూమిలేని పేదలకు భూమి అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించిందన్నారు. సమాన హక్కులు, గ్రామ స్వరాజ్యం సాధనలో భూదానోద్యమం కీలక పాత్ర పోషించిందని చెప్పారు.తమ కుటుంబం కూడా భూదాన స్ఫూర్తితో ముందుకు సాగిందని, గతంలో తమ తాత సంపాదించిన భూమిలో నుంచి 50 ఎకరాలు దానం చేశామని గుర్తు చేశారు. ఇటీవల గ్రామాభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్, సబ్‌స్టేషన్ నిర్మాణానికి 11 ఎకరాలు దానం చేసిన విషయాన్ని వెల్లడించారు.భూదానోద్యమానికి విశేష సేవలు చేసిన వెదిరే రామచంద్రారెడ్డి సేవలను కొనియాడుతూ, ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. పోచంపల్లి భూదానోద్యమానికి పుట్టినిల్లు కావడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.భూదానోద్యమం అహింసా మార్గంలో సామాజిక మార్పు సాధ్యమని ప్రపంచానికి చాటి చెప్పిందని, భూసంస్కరణల చరిత్రలో ఇది ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిందని అన్నారు. ఈ ఉద్యమం అందించిన స్ఫూర్తిని భావితరాలు కొనసాగించాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
