ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడే పలు కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ తీసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరే విధంగా రైల్వే, రోడ్డు, పోర్టుల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి-విశాఖపట్నం మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైల్వే రవాణా సామర్థ్యం పెరిగి ప్రయాణికులకు, సరుకు రవాణాకు మరింత సౌలభ్యం కలగనుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది. గ్రామీణ రహదారి అభివృద్ధికి కీలకమైన ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనను మరో మూడు సంవత్సరాల పాటు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపడేందుకు ఇది దోహదం చేస్తుంది.భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.12,980 కోట్ల నిధులను కేటాయించారు. సముద్ర రవాణా రంగానికి ఇది బలాన్నిస్తుందని భావిస్తున్నారు.అలాగే కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు రూ.9,889 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. సుమారు 198 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు.గోదావరి నదిపై సుమారు 4.3 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలో రవాణా, వాణిజ్య కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
