కోదాడ, ఫిబ్రవరి17( ,నేటి తెలుగు పత్రిక): ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మెడికల్ విద్యార్థికి కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన శీలం సోమయ్య కుమారుడు శీలం శ్రీరామ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు అయితే శ్రీరామ్ కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో కళాశాల ఫీజు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోదాడలోని కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి ఆ విద్యార్థిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. విద్యార్థి మెడిసిన్ చదువుకు అయ్యే మొత్తం ఫీజును చెల్లించేందుకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం బేతవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విద్యార్థి శ్రీరాం మొదటి సంవత్సరం కళాశాల ఫీజుకు సంబంధించిన రూ.50 వేల చెక్కును కోదాడలోని ప్రముఖ వైద్యులు, సామాజికవేత్త డాక్టర్ జాస్తి సుబ్బారావు, బేతవోలు సర్పంచ్ నాగయ్య చేతులమీదుగా విద్యార్థికి అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు, సర్పంచ్ నాగయ్య, ఇతర ప్రముఖులు మాట్లాడుతూ కత్రం శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బేతవోలు ఉపసర్పంచ్ ఏడుకొండలు, ఇతర గ్రామ పెద్దలు, కత్రం చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

