తెలంగాణలో ఉపాధ్యాయుల లెక్కలు: విద్యాశాఖ సమీక్ష
హైదరాబాద్: డిసెంబర్ 11
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరియు టీచర్ల సంఖ్య అనుసంధానాన్ని విద్యాశాఖ సమీక్షిస్తుంది. 2024-25 విద్యాసంవత్సరంలో 1,899 పాఠశాలల్లో జీరో ఎన్-రోల్ మెంట్ నమోదు అయ్యిందని, అంటే అక్కడ ఒక్క విద్యార్థి కూడా చేరలేదని అధికారులు గుర్తించారు.
జీరో ఎన్-రోల్ మెంట్ ఉన్న పాఠశాలల్లో 580 మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు. ఈ టీచర్లను ఇతర అవసరమైన పాఠశాలలలో సర్దుబాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఒక్క విద్యార్థి చేరిన పాఠశాలల సంఖ్య 53, వాటిలో 51 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
ఈ విద్యాసంవత్సరంలో 10 మందికి లోపు విద్యార్థులు చేరిన పాఠశాలల సంఖ్య మొత్తం 4,324, వాటిలో 3,326 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 26,101 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 1,06,641 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైమరీ పాఠశాలల సంఖ్య 18,254, టీచర్ల సంఖ్య 40,591, అప్పర్ ప్రైమరీ పాఠశాలల సంఖ్య 3,142, టీచర్ల సంఖ్య 13,871, హైస్కూళ్ల సంఖ్య 4,705, టీచర్ల సంఖ్య 52,179 అని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేయడం జరుగుతోంది. అయితే, జీరో ఎన్-రోల్ మెంట్ ఉన్న 1,899 పాఠశాలలలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ కూడా ఉన్నాయి. ప్రైమరీ పాఠశాలలలో 517 మంది టీచర్లు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలలో 33 మంది టీచర్లు, హైస్కూల్స్‌లో 30 మంది టీచర్లు ఉన్నారు.
ప్రతి విద్యార్థి సంఖ్య వృద్ధికి సంబంధించి, 1 నుంచి 10 మంది విద్యార్థుల ఉన్న పాఠశాలల సంఖ్య 2,415, వాటిలో 2,746 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 11 నుంచి 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల సంఖ్య 4,110, టీచర్లు 7,282. 21 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల సంఖ్య 3,307, టీచర్లు 7,213. 31 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల సంఖ్య 2,580, టీచర్లు 7,252. 41 నుంచి 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల సంఖ్య 1,827, టీచర్లు 6,545.
50 మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలల సంఖ్య 9,963, టీచర్లు 75,023 మంది ఉన్నారు. హైస్కూల్స్‌లో తక్కువ మంది విద్యార్థులు ఉన్నా, విద్యాబోధనలో ఎలాంటి ఆటంకం లేకుండా, ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులను సవ్యంగా కొనసాగించడం జరుగుతుంది.
జీరో ఎన్-రోల్ మెంట్ పాఠశాలల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లతో సమానంగా నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
