మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): భారతదేశానికి ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సుమారు 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ మోసుకొస్తున్న భారతీయ నౌక ‘శివాలిక్’ హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఈ నౌకకు భారత నావికాదళ యుద్ధ నౌకలు భద్రతగా సహకరిస్తున్నాయి.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇబ్రహీం రైసీ తో మాట్లాడిన తర్వాత పరిస్థితి సానుకూలంగా మారినట్లు సమాచారం. ఈ చర్చల తర్వాత భారత నౌకలకు హార్ముజ్ జలసంధి దాటేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది.హార్ముజ్ జలసంధిని దాటిన అనంతరం ఈ నౌక రెండు రోజుల్లో భారతదేశానికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. శివాలిక్ తర్వాత మరో ఎల్పీజీ ట్యాంకర్ కూడా ఈ మార్గం గుండా భారత్‌కు రానున్నట్లు సమాచారం. దీంతో దేశంలో ఏర్పడిన గ్యాస్ కొరత కొంత మేర తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమీపంలోని మినా సకర్ పోర్ట్ వద్ద మరో భారత నౌక కూడా లంగరు వేసి ఉంది. ఆ నౌకలోని ఎల్పీజీ ట్యాంకర్ సుమారు 3.6 మిలియన్ గ్యాస్ సిలిండర్లను నింపగల సామర్థ్యం కలిగి ఉంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ఆ నౌక కొంతకాలంగా అక్కడే నిలిచిపోయింది.ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ కొరత కనిపించడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు క్యూలు కట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, తప్పుడు ప్రచారం వల్లే ప్రజలు ఎక్కువగా బుకింగ్‌లు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.అలాగే గ్యాస్ అక్రమ మళ్లింపును అరికట్టేందుకు డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (DAC) వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. డిమాండ్‌ను నియంత్రించేందుకు ఎల్పీజీ బుకింగ్‌ల మధ్య కనీస వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు వెల్లడించారుప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వస్తోందని, మరికొన్ని ఎల్పీజీ నౌకలు భారత్‌కు చేరుకుంటే సరఫరా పూర్తిగా సవ్యంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
