ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: మెట్రో ప్రాంగణంలో క్రమశిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చట్ట సవరణలతో నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించనున్నారు.జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు, 2026 అమలులోకి రావడంతో, మెట్రోలో అనుమతి లేకుండా వస్తువుల విక్రయం, విరాళాల సేకరణ, ఇతర అనధికార కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి చర్యలకు ఇకపై ₹5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.ఇంతకుముందు ఈ నేరాలకు ₹100–₹400 వరకు మాత్రమే ఫైన్ ఉండేది. అయితే పెరుగుతున్న ఉల్లంఘనలను అరికట్టేందుకు ఈ జరిమానాను గణనీయంగా పెంచారు. ఈ మార్పులు మెట్రో రైల్వేలు (నిర్వహణ మరియు పర్యవేక్షణ) చట్టం, 2002లో సవరణల రూపంలో అమలు చేస్తున్నారు. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన జితిన్ ప్రసాద, చిన్న నేరాలను సివిల్ జరిమానాలుగా మార్చడం ద్వారా న్యాయస్థానాలపై భారాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని వెల్లడించారు.కొత్త నిబంధనలతో మెట్రో ప్రయాణం మరింత సురక్షితంగా, క్రమబద్ధంగా మారుతుందని ప్రభుత్వం పేర్కొంది.
