Breaking News

ప్రొరేటా డీలిమిటేషన్ విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు తగ్గే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఘన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజకీయ పరిస్థితులు, డీలిమిటేషన్ విధానం, సామాజిక న్యాయం అంశాలపై విస్తృతంగా ప్రసంగించారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొరేటా ఆధారిత నియోజకవర్గాల పెంపు విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల కేవలం భౌగోళికంగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయ పరంగా కూడా తీవ్రమైన అసమతుల్యత ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయించిన రిజర్వ్డ్ నియోజకవర్గాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.అంబేద్కర్ ఆలోచనలను గుర్తుచేస్తూ, “రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యం” అన్న ఆయన భావనను దృష్టిలో పెట్టుకుని దళితులు, గిరిజనులు, మేధావులు ఈ అంశంపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం సమాజం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పెంపుతో కలిపి ఒకే అంశంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం విమర్శించారు. మహిళల సాధికారత కోసం తీసుకువచ్చిన బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల హక్కుల పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రాథమికంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని చెప్పి, తరువాత దాన్ని ప్రొరేటా ఆధారంగా 50 శాతం పెంపుగా మార్చడం ద్వారా ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుందని సీఎం వివరించారు. ఈ విధానం అమలైతే ప్రస్తుతం ఉన్న సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆనందం.. ఈటెలకు కార్పొరేటర్ల కృతజ్ఞతలు

దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పన్నుల ఆదాయం, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగం వంటి రంగాల్లో దక్షిణాది రాష్ట్రాల కృషి దేశ పురోగతికి ఆధారమని ఆయన పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించడం న్యాయం కాదని ఆయన వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక న్యాయం దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని సీఎం తెలిపారు. కులగణన చేపట్టడం, ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేయడం వంటి చారిత్రక నిర్ణయాలు తెలంగాణలోనే మొదటగా అమలైనట్లు ఆయన చెప్పారు. చెప్పిన మాటను అమలు చేసే ప్రభుత్వం తమదేనని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఇళ్లు అందిస్తున్నామని, అందులో అధికంగా దళితులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. అలాగే 67 వేల ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు దక్కినట్లు ఆయన పేర్కొన్నారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్యను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.అప్పులు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

స్టాండప్ కామెడీ వివాదం.. అనుదీప్ కటికలపై చర్యలకు ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *