ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: తిరుపతిని క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. యువగళం హామీ మేరకు స్పోర్ట్స్ హబ్‌గా తిరుపతిని తీర్చిదిద్దే పనులు కార్యరూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పలు క్రీడా ప్రాజెక్టులను ప్రారంభించారు.తిరుపతి పట్టణంలోని గొల్లవానిగుంటలో శాప్, తుడా నిధులతో రూ.10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. ఇందులో క్రికెట్‌తో పాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను కూడా ప్రారంభించారు.ఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి మంత్రి లోకేష్ కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.అదేవిధంగా తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రూ.5.35 కోట్ల వ్యయంతో కరణం మల్లీశ్వరి వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ అకాడమీలో సుమారు 200 మంది క్రీడాకారులకు వసతి సదుపాయం కల్పించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన జూనియర్ బాక్సింగ్ రింగ్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. అలాగే గూడూరు నియోజకవర్గం కోటలో రూ.2.31 కోట్లతో, సూళ్లూరుపేటలో రూ.2.70 కోట్లతో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఇక రేణిగుంటలోని ఏపీఎస్టీఆర్ఈఐఎస్ పాఠశాలలో రూ.80 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించేందుకు కూడా మంత్రి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత పెంచుతూ, యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసి దేశ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చే క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పించామని పేర్కొన్నారు.

