ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.150 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు 52 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 32 మంది వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు, మేనేజర్లు ఉండటం సంచలనంగా మారింది.‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ పేరుతో ప్రత్యేకంగా చేపట్టిన దాడుల్లో భాగంగా పోలీసులు 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 16 ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేసి ఈ భారీ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించారు. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కై బ్యాంకు అధికారులు అక్రమంగా ఖాతాలను తెరిపించి, వాటిని మ్యూల్ అకౌంట్లుగా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మోసాల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, 5 మంది మధ్యవర్తులు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 350 మ్యూల్ ఖాతాల ద్వారా డబ్బులు మళ్లించబడినట్లు, వీటి ద్వారా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.
పెట్టుబడి స్కామ్‌లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ నెట్‌వర్క్ పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి మోసపూరితంగా సొమ్ము సేకరించి, మ్యూల్ అకౌంట్ల ద్వారా ఇతర ఖాతాలకు తరలించినట్లు దర్యాప్తులో బయటపడింది.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు ఇవ్వకూడదని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.మొత్తానికి, దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ భారీ సైబర్ మోసం కేసు కార్పొరేట్, బ్యాంకింగ్ రంగాల్లో కలకలం రేపుతోంది. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
