హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లపై విమర్శలు గుప్పిస్తూ ఇద్దరి రాజకీయ విధానాలను తప్పుబట్టారు.మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డిని ‘రాహువు’, కేసీఆర్‌ను ‘కేతువు’గా పేర్కొన్నారు. ఇద్దరూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వారి మాటలు, రాజకీయ ధోరణి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు.కాలేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై కూడా బండి సంజయ్ స్పందించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి మారిందని విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు విరుద్ధంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారని అన్నారు.కాలేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవినీతి మొత్తం ఎంత జరిగిందన్న దానిపై ప్రభుత్వం వివరాలు వెల్లడించకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని విమర్శించారు.కేసీఆర్ కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అవి నిజమైతే ఇప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.కాలేశ్వరం ప్రాజెక్ట్‌ను “ఏటీఎం”లా ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ, గతంలో బీఆర్‌ఎస్‌కు, ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉపయోగపడుతోందని అన్నారు. అధికారాలు మారినా విధానం మారలేదని విమర్శించారు.ఇక సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖలపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. కొంత మొత్తంపై మాత్రమే దర్యాప్తు కోరడం ఎందుకని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.తాము ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కరపత్రాల రూపంలో ప్రచారం చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు.
