Breaking News

మేడిగడ్డ బ్యారేజీపై సీఎం రేవంత్ ఫీల్డ్ విజిట్.. పునరుద్ధరణకు కార్యాచరణ వేగవంతం

మేడిగడ్డ, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పునరుద్ధరణ దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలకంగా ముందడుగు వేశారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడ జరుగుతున్న సాంకేతిక పరీక్షల పురోగతిని సమీక్షించారు. మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి డ్యామ్ ప్రాంతానికి చేరుకున్న సీఎం, జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలపై అధికారుల నుంచి వివరణలు తీసుకున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మార్గదర్శకాల ప్రకారం చేపడుతున్న ప్రతి పరీక్షను సమగ్రంగా పరిశీలించారు.బ్యారేజీ వద్ద పియర్స్ 20, 21, 22 ప్రాంతాల్లో బోర్ రిగ్స్ ద్వారా జరుగుతున్న శాంపిల్ సేకరణ ప్రక్రియను సీఎం దగ్గరగా గమనించారు. జీపీఆర్, సీస్మిక్ టెస్టులు, నేల స్వభావంపై జరుగుతున్న అధ్యయనాలపై అధికారులు వివరాలు అందించారు. సుమారు 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS)కు పంపి విశ్లేషణ చేయనున్నట్లు తెలిపారు.డ్రోన్ ఆధారిత GPR పరీక్షల ద్వారా నేల లోతు 20 నుంచి 30 మీటర్ల వరకు విశ్లేషణ సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. బ్యారేజీ నిర్మాణంలో వచ్చిన లోపాలను గుర్తించడానికి ఈ పరీక్షలు కీలకమని పేర్కొన్నారు.

కేంద్ర నిధులపై ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్ధమన్న బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. శాంపిల్స్ ఫలితాల ఆధారంగా సాంకేతికంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోని లోపాలను సరిచేసి ప్రాజెక్టును మళ్లీ ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. NDSA సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రతి దశలో అనుమతులు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, NDSA చైర్మన్ అనిల్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు దిశానిర్దేశం చేస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

రైతు భరోసా నిధుల విడుదల.. లక్షలాది రైతులకు ఆర్థిక ఊరట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *