మేడిగడ్డ, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును వదిలేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టును పూర్తిగా పునరుద్ధరించి మళ్లీ ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న సాంకేతిక పరీక్షలను సీఎం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS), నీటి పారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులతో కలిసి సమీక్ష నిర్వహించారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పరిస్థితిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్ర జల సంఘం సూచనలు, నిపుణుల అభిప్రాయాలతో ముందుకు సాగుతామని చెప్పారు.అలాగే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. తుమ్మడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడి నుంచి చేవెళ్ల వరకు నీటిని తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు.
ప్రాజెక్టు చరిత్రను ప్రస్తావిస్తూ, 1975లోనే ఈ ప్రణాళిక ప్రారంభమైందని, తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో జలయజ్ఞం భాగంగా వేగం పుంజుకుందని గుర్తుచేశారు. అనంతరం ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చేయడంతో వ్యయం పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిపారు.బ్యారేజీల నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఇంజనీర్లు ముందుగానే గుర్తించినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. 2023లో జరిగిన ఘటన తర్వాత ఎన్డీఎస్ఏ నివేదికలో కూడా డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నట్లు వెల్లడైనట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రాజెక్టును సమగ్రంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు, పునర్నిర్మాణంతో మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు.



