ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, కంకర, ఎర్రమట్టి వంటి ఖనిజాల సరఫరాలో ఉన్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు గనుల శాఖ నిబంధనలను సడలిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఖనిజాల తవ్వకం, రవాణా అనుమతులకు మూడు నుంచి ఐదు నెలల వరకు సమయం పట్టేది. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు అనుమతులను వారం రోజుల్లోనే పూర్తి చేసేలా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.నిర్మాణ సంస్థలు దరఖాస్తు చేసిన వెంటనే సంబంధిత అధికారులకు పంపించి, తహశీల్దార్ నుంచి నివేదికలు, సర్వేలు, తనిఖీలు అన్నీ వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి దశలో గడువులను గణనీయంగా తగ్గించింది. జిల్లా స్థాయిలో పరిశీలనకు ముందు 15 రోజులు పట్టగా, ఇప్పుడు రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.తహశీల్దార్ నివేదికలను మూడు రోజుల్లో ఇవ్వాలని, మైనింగ్ దరఖాస్తులపై సర్వే, ప్రాసెసింగ్ కూడా తక్కువ సమయంలో పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయి అనుమతులు, ఎన్‌ఓసీలు కూడా తక్కువ గడువులోనే ఇవ్వాలని స్పష్టం చేశారు.మొత్తంగా ఏ దరఖాస్తైనా వారం రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని, అవసరమైన నిర్మాణ సామగ్రి సమయానికి అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
