హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని హైకోర్టు అభిప్రాయపడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం మాట్లాడిన మంత్రి, కమిషన్ నియామకాన్ని కోర్టు సమర్థించిందని తెలిపారు. అయితే కమిషన్ నివేదికలో కొందరిపై చేసిన వ్యాఖ్యల విషయంలో, వారికి ముందుగా నోటీసులు ఇవ్వలేదని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ఈ కారణంగా ఆ వ్యాఖ్యలు అమల్లో ఉండవని స్పష్టం చేశారు.ఇది క్లీన్ చిట్ కాదని, కేవలం సాంకేతిక అంశంపై ఇచ్చిన తీర్పు మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అవకతవకలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసిందని తెలిపారు. హైకోర్టు తీర్పుతో సీబీఐ దర్యాప్తుకు ఎలాంటి అడ్డంకి లేదన్నారు.మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం ప్రాజెక్టులోని లోపాలను స్పష్టంగా చూపిస్తోందని, డిజైన్ నుంచి నిర్మాణం వరకు అనేక సమస్యలు ఉన్నాయని మంత్రి ఆరోపించారు. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రాజెక్టు కారణంగా రాష్ట్రానికి భారీ ఆర్థిక భారం పడుతోందని, ప్రతి సంవత్సరం భారీగా అప్పులు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. కాళేశ్వరం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలను బయటపెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
