హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల విచారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.తెలంగాణ హైకోర్టు తాజా తీర్పు ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా బయటపెట్టిందని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చట్టపరంగా సమర్థంగా కోర్టులో ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సరైన ఆధారాలను సమర్పించలేకపోవడం వల్లే తదుపరి చర్యలు నిలిచిపోయాయని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క కీలక కేసులో కూడా స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, భూ వ్యవహారాలు, డ్రగ్స్ కేసులు వంటి అంశాల్లో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులన్నింటిపై దర్యాప్తు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రజలను మోసం చేసే విధంగా నాటకీయ పోరు జరుగుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఆచరణలో మాత్రం చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు రాజకీయ ద్రోహమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల హామీల ప్రకారం పారదర్శకంగా, చట్టబద్ధంగా అవినీతి కేసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
