హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం హజ్-2026 యాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో యాత్ర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష జరిగింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హజ్ యాత్ర ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని తెలిపారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఈసారి సుమారు 10 వేల మంది యాత్రికులు హజ్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వసతి, రవాణా, వైద్య సేవలు, భద్రత వంటి అంశాల్లో సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.విమానాశ్రయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, సామాను నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియలను సులభతరం చేయాలని తెలిపారు.యాత్రికుల ఆరోగ్య భద్రత కోసం ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ప్రయాణ సమయంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచిస్తూ, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని యాత్రికుల ప్రయాణం సజావుగా జరిగేలా చూడాలని అన్నారు.గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈసారి మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు వెల్లడించారు.
