ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): కుషాయిగూడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసనకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కార్మికుల్లో అసంతృప్తి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ధర్నాలో పాల్గొన్న కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్మికుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సూచించిన ఆయన, ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలని అన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
