ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని, గ్రామీణ వ్యవస్థ బలోపేతం అయితేనే సమగ్ర పురోగతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.గ్రామాలే దేశ అభివృద్ధికి పునాది అని గుర్తుచేసిన సీఎం, ప్రజాప్రభుత్వం స్థానిక స్వపరిపాలన బలోపేతానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. పంచాయతీలు సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని తెలిపారు.భారత రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు స్వయం పరిపాలన హక్కులు కల్పించబడిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం, ఇది ప్రజాస్వామిక వికేంద్రీకరణకు కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధనలో పంచాయతీ రాజ్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.గ్రామీణ భారతదేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించడంలో స్థానిక సంస్థల పాత్ర మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తన సందేశంలో స్పష్టం చేశారు.
