ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్మికులు సమ్మెను విరమించి చర్చలకు రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చలు జరపనుంది.ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును కూడా కేబినెట్ సమీక్షించింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, తదుపరి చర్యలపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయిల చెల్లింపులపై కూడా మంత్రివర్గం చర్చించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం కోత విధించి, ఆ నిధులను రిటైర్డ్ ఉద్యోగులకు వినియోగించే ప్రతిపాదనకు మంత్రులు సానుకూలంగా స్పందించారు.హైదరాబాద్ గచ్చీబౌలి స్టేడియాన్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆధునిక సౌకర్యాలతో 21 క్రీడలకు అనువుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అదనంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ, మంచిర్యాల జిల్లాలో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్ ఏర్పాటు వంటి అంశాలకు కూడా ఆమోదం లభించింది.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలకు వెళ్లకుండా, సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రభుత్వం మరోసారి కోరింది.


