Breaking News

ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై దాడి.. సూర్యాపేటలో కలకలం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేటలో ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్న జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్శర్ల సత్యనారాయణపై జరిగిన దాడి తీవ్ర కలకలాన్ని రేపింది. మోతె మండలం రాఘవాపురం గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.సత్యనారాయణ గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలందిస్తూ, తనకు చెందిన సుమారు 70 ఎకరాల భూమిలో వేలాది మొక్కలను నాటి దట్టమైన అడవిగా అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతం స్థానిక జీవవైవిధ్యానికి ఆశ్రయంగా మారింది. అయితే, ఇటీవల కొందరు గొర్రెల కాపరులు ఈ అడవిలో గొర్రెలను మేపుతూ చెట్లకు నష్టం కలిగిస్తున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం అక్కడికి చేరుకున్న సత్యనారాయణ, అడవిలో గొర్రెల మేపుపై ప్రశ్నించగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కాపరులు కర్రలు, రాళ్లు, గొడ్డళ్లతో ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది.ఈ దాడిలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొనకుండా భద్రతను పెంచారు.పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తిపై దాడి జరగడం పట్ల పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి, అడవి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *