ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను గ్రామ స్థాయి వరకు విస్తరించి, ప్రజలకు మరింత చేరువ చేయాలనే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే, 2023 డిసెంబర్ 8న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు సమర్పించే అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు అక్కడికక్కడే స్వీకరించి వేగంగా పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజావాణి నిర్వహణ కొనసాగుతోంది.అయితే దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ లేదా జిల్లా కేంద్రాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఈ సేవలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎంవో అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.మొదటి దశలోనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, అనంతరం మండల స్థాయికి విస్తరించాలని సూచించారు. ప్రజావాణిలో అందే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేసి, సంబంధిత విభాగాలకు పంపించాలని, పరిష్కార పురోగతిని అర్జీదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఖచ్చితమైన గడువులు నిర్ణయించి, ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అలాగే ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారం కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని, ప్రతి శాఖలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఒక స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే, ఆటో ఎస్కలేషన్ విధానంతో పైస్థాయి అధికారికి అర్జీ చేరేలా వ్యవస్థను రూపొందించాలని, అవసరమైతే అప్పీల్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.డ్యాష్‌బోర్డ్ ద్వారా ప్రతి ఫిర్యాదు స్థితిని పర్యవేక్షించే విధానం ఉండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులుగా నిర్ణయించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించడం ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పెండింగ్ కేసులు తగ్గుతాయని, స్థానికంగానే సమస్యలు పరిష్కరించే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రజావాణి సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.
