ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి తల్లిదండ్రులు, విద్యార్థులు, యువత భారీగా హాజరై ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా వ్యాపార ధోరణిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు అధిక ఫీజులు, డొనేషన్లు, ఇతర ఛార్జీల పేరుతో తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని ఆరోపించారు.మధ్యతరగతి కుటుంబాలకు పిల్లల చదువు భారంగా మారిందని, ఒక కుటుంబం సంపాదనలో పెద్ద భాగం విద్య ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు ఏడాది ఆదాయం కూడా ఒక్క పిల్లాడి ఫీజుకే సరిపోతే, అది విద్యా వ్యవస్థ కాదని, బహిరంగ దోపిడీ అని మండిపడ్డారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు, బస్ ఫీజులు, మెటీరియల్ ఛార్జీలు వంటి పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.ఇతర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ కఠినంగా అమలవుతుండగా, తెలంగాణలో మాత్రం నియంత్రణ లోపించిందని విమర్శించారు. ప్రభుత్వం విద్య హక్కు చట్టాలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడుతున్న సమయంలో ప్రైవేట్ సంస్థలకు అనుమతులు పెరగడం సామాజిక అసమానతలను మరింత పెంచుతోందని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.ఈ మహాధర్నాలో టీఆర్‌పీ నాయకులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
