ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి టి. హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.జైలులో ఉన్న బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు.తమ ఫోన్‌లను హ్యాక్ చేస్తున్నారని, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలపై కూడా నిఘా పెడుతున్నారని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తెప్పించి పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. “ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులు జాగ్రత్త.. రిటైర్ అయినా వదిలిపెట్టం” అంటూ హెచ్చరించారు.మన్నే క్రిశాంక్‌తో పాటు పలువురిపై అక్రమ కేసులు నమోదు చేశారని, ఫిర్యాదు చేసిన వారిపైనే పోలీసులు కేసులు పెట్టడం విచారకరమని అన్నారు. నాన్-బెయిలబుల్ కేసులు పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.రైతులు, సాధారణ ప్రజల సమస్యలపై మాట్లాడిన వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించిన హరీశ్ రావు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సరైంది కాదని నిలదీశారు.మొత్తంగా, ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు, అక్రమ కేసుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
