Breaking News

కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతాం.. ప్రజల సమస్యలే మా అజెండా: కవిత

మే 02, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరుగుతున్న వేళ, కవిత కీలక ప్రకటనలతో రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని, ఇప్పుడు ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. “తెలంగాణ రక్షణ సేన” పేరుతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసినట్లు ప్రకటిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.ఇప్పటికే 20 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి సంస్థను యథాతథంగా కొనసాగిస్తామని, అదే సమయంలో కొత్త రాజకీయ వేదిక ద్వారా ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సర్వోదయ తెలంగాణ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కవిత పేర్కొన్నారు.ఈ సందర్భంగా “పాంచజన్యం” పేరుతో ఐదు ముఖ్య ప్రాధాన్యత అంశాలను ప్రకటించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ఈ ఐదు అంశాలే తమ పాలనకు దిశానిర్దేశం చేస్తాయని చెప్పారు. ముఖ్యంగా విద్య, వైద్యం రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజల ఆదాయంలో అధిక శాతం ఈ రంగాలకే వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తున్నప్పటికీ, చాలా మంది ప్రైవేట్ విద్యాసంస్థలను ఆశ్రయించాల్సి వస్తోందని, వారికి కూడా ఉచిత విద్య అందించే విధానంపై ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.

కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా

వైద్య రంగంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేదలు సరైన చికిత్స లేక ప్రాణాలు కోల్పోతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే ప్రజల ఆరోగ్యానికి ఎంత ఖర్చైనా వెనుకాడబోమని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు.రైతుల సమస్యలపై స్పందిస్తూ, ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పడుతున్న ఇబ్బందులను ఆమె ప్రస్తావించారు. రైతులు తమ పంటను విక్రయించడానికి నిరసనలు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. రైస్ ఎగుమతులకు అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతు మరణాల ఘటనలను ప్రస్తావిస్తూ, రైతుల గౌరవాన్ని కాపాడే విధానాలు అవసరమని స్పష్టం చేశారు.యువత ఉపాధిపై కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వల్ల యువత నిరాశలో ఉందని పేర్కొన్నారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల యువతను నమ్ముకుంటున్నామని, 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాపారాల కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం వెతకకుండా, ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.అదే విధంగా, సీనియర్ సిటిజన్స్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వృద్ధులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించే విధంగా ప్రత్యేక పథకాలు తీసుకువస్తామని చెప్పారు. అలాగే అగ్రవర్ణాల్లోని పేదలు, వికలాంగులు, మాజీ సైనికులు వంటి వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా సమానత్వం సాధిస్తామని తెలిపారు.

కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ధర్మపురి అర్వింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *