హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాలను తాండూరులో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రైతుల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకువచ్చే లక్ష్యంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అధికారులు ప్రత్యక్షంగా రైతులతో మమేకమై సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడతారని తెలిపారు.చివరి రైతు వరకు ప్రభుత్వ పథకాలు చేరవేయడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మట్టి ఆరోగ్యం, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. మార్కెట్ లింకేజులు, రుణాలపై సమాచారం అందిస్తామని తెలిపారు.డ్రోన్లు, వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలు ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సౌరశక్తి వినియోగం, పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తిపై కూడా రైతులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.వర్షాకాలానికి ముందస్తు సాగునీటి ఏర్పాట్లు చేపడుతున్నామని, జిల్లా కలెక్టర్లు మరియు నోడల్ అధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
