మే 05, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయంగా తొలి అడుగును పాలమూరు నేల నుంచే వేయనున్నారు. పార్టీ స్థాపన అనంతరం కృష్ణా జలాల సాధననే ప్రధాన అజెండాగా తీసుకున్న ఆమె, ఈ నెల 8న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు.ఆ రోజు ఉదయం జోగులాంబ అమ్మవారి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సాయంత్రం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెంలో నిర్వహించే “పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ”లో పాల్గొని ప్రసంగించనున్నారు.తెలంగాణ ఏర్పడి దశాబ్దం దాటినా కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్రం వెనుకబడి ఉందని కవిత విమర్శించారు. దీనికి పాలకుల విధానాలే కారణమని పేర్కొంటూ, నీటి హక్కుల కోసం ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. కృష్ణా, గోదావరి జలాలను సమర్థంగా వినియోగించి బీడు భూములను సాగులోకి తేవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదని, ముఖ్యంగా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సహా పలు ప్యాకేజీలు ఆలస్యం కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయించే దిశగా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ఇక ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
