మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్-2047’ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రణాళికలను వెల్లడించారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌ను ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేసి ‘సిగ్నల్ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నగరంలో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు, సర్ఫేస్ రోడ్లతో త్రీ లెవెల్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం రోడ్ల విస్తరణతో సరిపోదని, మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. నగరంలో పార్కింగ్ సమస్యలను తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కాలుష్య నియంత్రణలో భాగంగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. నగర పరిధిలో ఆటోలను ఉచిత రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఈవీ వాహనాలుగా మార్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు చెప్పారు.రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణను మూడు ప్రత్యేక జోన్లుగా విభజించినట్లు సీఎం వివరించారు. ‘క్యూర్, ప్యూర్, రేర్’ మోడల్ ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాలను సేవారంగ కేంద్రాలుగా, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాలను తయారీ రంగ అభివృద్ధికి, ఆర్‌ఆర్‌ఆర్ వెలుపల ప్రాంతాలను వ్యవసాయ రంగ అభివృద్ధికి కేటాయించనున్నట్లు చెప్పారు.మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని సీఎం వెల్లడించారు. నగర సంస్కృతి, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
