కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రశంసలు పొందిన పశ్చిమ గోదావరి ‘వేస్ట్ టు వెల్త్’ మోడల్
అమరావతి, మే 10, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం ప్రవేశపెట్టిన “సర్క్యులర్ ఎకానమీ బ్లూప్రింట్” రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ , జిల్లా మేజిస్ట్రేట్ చదలవాడ నాగరాణి చేసిన ఈ ప్రజెంటేషన్ సదస్సులోని ప్రభుత్వ కార్యదర్శులను, ఇతర జిల్లాల కలెక్టర్లను, అమాత్యులను విశేషంగా ఆకర్షించింది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఇదే తరహా నమూనాలను జిల్లాల వారీగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్ధక రంగాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను పరిశ్రమలు, విద్యుత్, ఇంధనం, ఎగుమతి ఉత్పత్తులుగా మార్చే అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. కలెక్టర్లు, పరిశ్రమల నిపుణులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు కలిసి జిల్లా వారీగా “సర్క్యులర్ ఎకానమీ” ప్రణాళికలు రూపొందిస్తే ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
దేశంలోనే మిగిలే సంపద
సాధారణంగా పెద్ద పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు వచ్చినప్పుడు ఉత్పత్తి ఇక్కడ జరిగినా, సాంకేతికత, యంత్రాలు, బ్రాండ్లు, మార్కెటింగ్ వ్యవస్థలు మాత్రం బహుళజాతి సంస్థల చేతుల్లోనే ఉంటాయి. దీంతో చివరికి భారీ స్థాయిలో లాభాలు కూడా విదేశాలకు వెళ్లిపోతుంటాయి. స్థానిక ప్రజలకు పరిమిత ఉపాధి మాత్రమే మిగులుతుంది. కానీ పశ్చిమ గోదావరి ప్రతిపాదించిన “సర్క్యులర్ ఎకానమీ” మోడల్ పూర్తిగా భిన్నంగా ఉంది. రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేసేదిగా ఉంది. స్థానికంగా లభించే వరి ఊక, రొయ్యల వ్యర్థాలు, పశువులు, కోళ్ల ఎరువు, కోకో, వ్యవసాయ అవశేషాలనే ముడి పదార్థాలుగా ఉపయోగించి ఎక్కడికక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యం. అంటే రైతు వద్ద నుంచి వచ్చిన వ్యర్థం స్థానిక పరిశ్రమకు ముడి సరుకుగా మారుతుంది. అదే గ్రామీణ యువతకు ఉపాధి ఇస్తుంది. తయారైన ఉత్పత్తి ద్వారా వచ్చిన ఆదాయం మళ్లీ అదే ప్రాంత ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి దోహదం చేస్తుంది.
ఈ విధానంలో పెట్టుబడులు, ఉత్పత్తి, ఉపాధి, లాభాలు అన్నీ రాష్ట్రానికే దక్కుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, చిన్న పరిశ్రమలు, మహిళా సంఘాలు, రైతు సమాఖ్యలు నేరుగా లాభపడే అవకాశం ఉంటుంది. అంటే “వేస్ట్ టు వెల్త్” మాత్రమే కాదు… “లోకల్ రిసోర్సెస్ టు లోకల్ ప్రాస్పెరిటీ” అనే కొత్త ఆర్థిక సూత్రానికి పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నస్గరాణి మోడల్ నాంది పలుకుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, మహిళా సాధికారత అన్నింటినీ కలిపిన సమగ్ర నమూనాగా కలెక్టర్ల సదస్సులో ఈ ప్రజెంటేషన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
వ్యవసాయం నుంచి పరిశ్రమలకు
పశ్చిమ గోదావరిలో వరిని కేవలం ఆహార పంటగా కాకుండా పరిశ్రమల ముడి పదార్థంగా కూడా ఉపయోగించే ప్రణాళికను అధికారులు వివరించారు. వరి ఊక నుండి విద్యుత్ ఉత్పత్తి, సిలికా, ప్రాక్టికల్ బోర్డ్స్, ఫ్లైవుడ్ పర్నిచర్ తయారీ, తవుడుతో నూనె ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే వరి గడ్డితో ఎథనాల్ తయారీ అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఆక్వా వ్యర్థాలతో ఎగుమతులు
జిల్లాలో రోజూ ఉత్పత్తి అవుతున్న 30 నుంచి 40 టన్నుల చేపలు, రొయ్యల వ్యర్థాలను ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్, జెలిటిన్ వంటి విలువైన ఉత్పత్తులుగా మార్చే ప్రణాళికను ప్రతిపాదించారు. రొయ్య పొట్టు, చేపల పొలుసులతో విభిన్న ఎగుమతి ఉత్పత్తులు తయారు చేసి ఆక్వా రంగ ఆదాయాన్ని గణనీయంగా పెంచే అవకాశాలు ఉన్నాయి.
బయోగ్యాస్, సేంద్రియ వ్యవసాయం
పశుసంవర్ధక రంగంలో భాగంగా వచ్చే రెండేళ్లలో 40 వేల బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. పశువులు, కోళ్ల ఎరువుతో వంటగ్యాస్ , సేంద్రియ ఎరువుల తయారీ ఫలితంగా సహజ వ్యవసాయానికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది.
మహిళల ఆధ్వర్యంలో పరిశ్రమలు
స్థానికంగా పండే కోకోతో డ్వాక్రా మహిళలు చాక్లెట్ తయారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెంలోని “చోకో టేల్స్”, ఉండి మండలంలోని “ది స్లో బీన్” వంటి బ్రాండ్లు ఇప్పటికే లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాయని కలెక్టర్ తన ప్రజెంటేషన్‌లో వివరించారు.
పెట్టుబడిదారుల ఆసక్తి
భీమవరంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో రైస్ మిల్లర్లు, ప్రజాప్రతినిధులు వేస్ట్ టు వెల్త్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ముందుకు రాగా ఈ క్రమంలో 500 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు రూ.60 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తమైనట్లు వెల్లడించారు. వికేంద్రీకృత పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలను ఒకే ప్రాంతంలో కేంద్రీకరించకుండా తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం నియోజకవర్గాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా చిన్న పరిశ్రమల క్లస్టర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
జీరో వేస్ట్ జిల్లా లక్ష్యం: నాగరాణి
వ్యవసాయ జిల్లా అనే గుర్తింపుతోనే కాకుండా “జీరో వేస్ట్ ఇండస్ట్రియల్ హబ్”గా పశ్చిమ గోదావరిని తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రతి వ్యర్థాన్ని ఆదాయ వనరుగా మార్చే ఈ నమూనా భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

