మే 11, (నేటి తెలుగు పత్రిక): సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా నమూనాలో అమరావతిలో ఆధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ టౌన్‌షిప్ ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే ఆదర్శ మోడల్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ ప్రాజెక్టును వేగంగా అమలు చేసేందుకు విధివిధానాలను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కోరారు.సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందం, సింగపూర్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై చర్చించారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే సంస్థల కోసం ఇప్పటికే RFP నోటిఫికేషన్ విడుదల చేసినట్లు లోకేష్ వెల్లడించారు. అమరావతికి జాతీయ స్థాయిలో చట్టబద్ధ గుర్తింపు రావడం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతోందన్నారు.ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ తరహాలో గ్లోబల్ MICE (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం సింగపూర్ సన్‌టెక్ సిటీ నమూనాను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకుంటామని పేర్కొన్నారు.సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్య అవకాశాలను విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అనుకూల వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఇటీవల సింగపూర్–ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ (SAGE) కార్యక్రమంలో భాగంగా ఏపీకి చెందిన ఆరుగురు మంత్రులు, పలువురు అధికారులు, 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు శిక్షణ పొందిన విషయాన్ని లోకేష్ గుర్తుచేశారు. అక్కడ నేర్చుకున్న పరిపాలనా విధానాలు, విద్యా పద్ధతులను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గాన్ సియో హువాంగ్, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
