మే 11, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు ఉన్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి సీబీఎస్ఈ తరహాలో 11, 12 తరగతుల వ్యవస్థను అమలు చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ విధానం అమల్లోకి వస్తే విద్యార్థుల డ్రాపౌట్ శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.ప్రస్తుతం దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు, సీబీఎస్ఈ బోర్డు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన అనేక మంది విద్యార్థులు ఆ తర్వాత వేరే కళాశాలల్లో చేరకుండా విద్యను మధ్యలోనే నిలిపివేస్తున్న పరిస్థితి ఉందని ప్రభుత్వం గుర్తించింది.ఈ నేపథ్యంలో గతంలోనే ఇంటర్మీడియట్‌ను ప్రత్యేక వ్యవస్థగా కాకుండా 11, 12 తరగతుల రూపంలో కొనసాగించే అవకాశాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే విషయాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ తన నివేదికలో కూడా ప్రస్తావించింది.అయితే ఇటీవల ఇంటర్మీడియట్ ప్రవేశాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.విలీన ప్రక్రియకు సంబంధించి అనేక సాంకేతిక, పరిపాలనా అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నందున ప్రస్తుతం ఆ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విద్యా రంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు తదితర భాగస్వాములతో విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.అదేవిధంగా తెలంగాణ విద్యా విధానంపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికపై శాసనసభలో చర్చించి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
