Breaking News

పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో చంద్రబాబు పరుగులు.. కేంద్ర మంత్రి సీ ఆర్ పాటిల్‌తో కీలక భేటీ

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్‌తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన Pపోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, నిధుల విడుదల, కేంద్ర అనుమతులు, అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అవసరమని ఆయన కోరారు. ముఖ్యంగా తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటి నిల్వ సామర్థ్యాన్ని సాధించేందుకు అవసరమైన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై కూడా సీఎం వివరాలు వెల్లడించారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం వేగంగా సాగుతోందని, గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా కీలక దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు స్వయంగా పోలవరం ప్రాంతాన్ని సందర్శించి పనులను సమీక్షించినట్లు చెప్పారు.ఇక పోలవరం పనులకు అడ్డంకిగా మారిన 2011 స్టాప్ వర్క్ ఆర్డర్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందనే కారణంతో అప్పట్లో విధించిన ఆంక్షలు ప్రాజెక్టు పురోగతిని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులు తొలగిస్తే పనులు మరింత వేగంగా పూర్తవుతాయని తెలిపారు.కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని కూడా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పెంచినట్లు చంద్రబాబు వివరించారు. మొదట నిర్ణయించిన దానికంటే కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం కుడి కాలువ పనులు 95 శాతం, ఎడమ కాలువ పనులు 78 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. అదనపు సామర్థ్యం కారణంగా వచ్చిన వ్యయాన్ని కేంద్రం రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ప్రాజెక్టు తదుపరి దశల కోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని కూడా సీఎం కోరారు. అలాగే ప్రధాని కృషి సీంచాయ్ యోజన కింద రాష్ట్రంలోని చెరువులు, కాలువలు, నీటి వనరుల పునరుద్ధరణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 297 నీటి వనరుల అభివృద్ధికి రూ.285 కోట్ల నిధులు అవసరమని కేంద్రానికి వివరించారు.ఈ సమావేశంలో ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కర్ణాటకలోని ఆలమట్టి ఆనకట్ట ఎత్తు పెరిగితే రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల నీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయొద్దని కేంద్రాన్ని కోరారు.అదే సమయంలో పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద జలాలను వృథాగా సముద్రంలో కలవకుండా రాయలసీమ ప్రాంతాలకు మళ్లించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. రాష్ట్ర భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని పేర్కొన్నారు.వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం, హెడ్ స్లూయిస్ సామర్థ్య పెంపు, ఒడిశా భూసేకరణ సమస్యలపై కూడా సీఎం కేంద్ర జలశక్తి మంత్రికి ప్రత్యేకంగా లేఖ అందజేశారు. ఏపీ ప్రయోజనాలను కాపాడే విధంగా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు కోరుతున్నారు. ముఖ్యంగా నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఈ పర్యటన కీలకంగా మారింది.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *