మే 12, (నేటి తెలుగు పత్రిక): నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు కేవలం విధాన మార్పులు మాత్రమే కాకుండా, భావి తరాల భవిష్యత్తును నిర్మించే మహత్తర కార్యక్రమమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను అనాధలుగా చూడబోమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటారో అదే భావంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులను చూసుకోవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖ ఏర్పాటు చేసిన పలు ప్రదర్శన స్టాళ్లను సందర్శించి విద్యా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. అలాగే కోర్ అర్బన్ ఏరియాలో రూ.1011 కోట్ల వ్యయంతో నిర్మించనున్న “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల”కు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, సలహాదారులు కేశవరావు, హనుమంతరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. సిలబస్ విధానం మారుతోందని, కృత్రిమ మేధస్సు ప్రభావం పెరుగుతోందని, జాతీయ విద్యా విధానం కొత్త దిశలో సాగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కొనసాగించే సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థగా తెలంగాణ నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం మౌలిక వసతులు మాత్రమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పాఠశాలల్లోనే బలవర్థకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిదని, అక్కడ చదివే పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు వెల్లడించారు.విద్యార్థులపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఖర్చు కాదని, అది భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. భావితరాల నాయకులు, శాస్త్రవేత్తలు, ప్రజాసేవకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే రావాలని ఆకాంక్షించారు. అందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెబుతూ, బడ్జెట్‌లో 8.22 శాతం నిధులను విద్యా రంగానికి కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఈ కేటాయింపులను దశలవారీగా 15 శాతం వరకు పెంచుతామని వెల్లడించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమతౌల్యం పాటిస్తూ విద్యా రంగానికి మరింత నిధులు కేటాయించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్మీడియట్ దశలో డ్రాపౌట్స్ అధికంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. తొలిదశలో హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.కోర్ అర్బన్ ఏరియాలో పెరుగుతున్న జనాభా, ఉపాధి కోసం వలస వస్తున్న నిరుపేద కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు రూ.1700 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పేదలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ అత్యంత ముఖ్యమైన బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని పేర్కొన్న ముఖ్యమంత్రి, విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. కొందరు ఉపాధ్యాయులను ఇప్పటికే విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. జపాన్, సింగపూర్, వియత్నాం వంటి దేశాల్లో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలను పరిశీలించేందుకు ప్రతీ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచే 500 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి విదేశాలకు పంపే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం సత్కరిస్తుందని వెల్లడించారు.
విద్యా రంగంలో తీసుకొస్తున్న మార్పులు నాయకుల కోసమో, ఉపాధ్యాయుల కోసమో కాదని, అత్యంత నిరుపేద కుటుంబాల పిల్లల భవిష్యత్తు కోసం చేపడుతున్నవేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సంస్కరణల అమలులో ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులతో చర్చించి ముందుకు సాగుతామని పేర్కొన్నారు.ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు అందించే పాఠశాల సామగ్రి, యూనిఫార్మ్‌లు తదితర వస్తువుల కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. వాటి నాణ్యతలో ఎలాంటి లోపం ఉన్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బడి ప్రారంభమైన రోజునే విద్యార్థులకు ఒక జత డ్రెస్ అందించి, నెల రోజుల్లో మరో జత అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.సంస్కరణలు అమలు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, తుదకు అవి నిరుపేద కుటుంబాల పిల్లలకు మేలు చేసే విధంగానే ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అత్యుత్తమ విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 19 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ఒక బాధ్యతతో కూడిన భావోద్వేగమని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.నిరుపేదలకు మంచి నాణ్యమైన విద్య అందించడమే తన ఆలోచన, తన కల అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రోత్సాహక చెక్కులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశారు.




