Breaking News

హ్యామ్ ప్రాజెక్ట్ పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

మే 12, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రహదారుల అభివృద్ధి పనుల్లో కీలకమైన హ్యామ్ (HAM) ప్రాజెక్టుల పురోగతిపై రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సుమారు మూడు గంటల పాటు ఆయన విస్తృతంగా చర్చించారు.సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న హ్యామ్ రహదారి ప్రాజెక్టుల పురోగతి, పనుల నాణ్యత, నిర్మాణ వేగం, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. రహదారుల అభివృద్ధి వల్ల గ్రామాలు, మండలాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు. పరిశ్రమల స్థాపనకు రోడ్డు మౌలిక వసతులు కీలకమని, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రవేశపెట్టిన హ్యామ్ విధానం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 2016 నుంచి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ విధానాన్ని అమలు చేస్తూ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ నమూనా ఇప్పటికే అమలులో ఉందని తెలిపారు.తెలంగాణలో హ్యామ్ ఫేజ్-1 కింద రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.13,006 కోట్లకు పైగా వ్యయంతో 441 రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇవి సుమారు 6,092 కిలోమీటర్ల పొడవున 34 ప్యాకేజీలుగా అమలవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.6,250 కోట్లతో 2,162 రహదారుల నిర్మాణ పనులు 7,450 కిలోమీటర్ల మేర కొనసాగుతున్నాయని వివరించారు. టెండర్ ప్రక్రియ, పనుల నాణ్యతపై వస్తున్న ఆరోపణలపై మంత్రి ఆరా తీశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్సెస్ వ్యయం తక్కువగానే ఉందని అధికారులు గణాంకాలతో వివరించారు. అన్ని ప్రాజెక్టులు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీస్ ఆధారంగా పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించి అమలు చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, పరిశ్రమల విస్తరణకు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలకు హ్యామ్ ప్రాజెక్టులు కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాలపై త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు కూడా తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *