హైదరాబాద్ ,ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వున్న కల్లుగీత కార్మిక కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. తక్షణమే గీత కార్మికులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందిచాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా కల్లుగీత కార్మిక కుటుంబాలు ఉన్నాయి. గత రెండు సంవత్సరాల కాలంలో చెట్లెక్కి కిందపడి వృత్తికి దూరమైన కార్మికులు 850 మంది ఉన్నారు. 140 మంది చనిపోయారు. మరో 170 మంది శాశ్వతంగా వికలాంగులైనారు. వారికి ఇస్తామన్న ఐదు లక్షలు ఇవ్వలేదు. 14 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఎక్స్‌గ్రేషియా 5లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతామన్న కామారెడ్డి డిక్లరేషన్ హామీ నేటికీ అమలు చేయడం లేదు. దీంతో పాటుగా నీరాకేఫ్‌ను అభివృద్ధి చేసి ఆ కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నది.
గీత కార్మికసంఘం ఆధ్వర్యంలో కార్మికులు నిన్న ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమం నిర్వహించి, ఆందోళన చేశారు. కార్మికుల పోరాటానికి సిపిఎం మద్దతు తెలియజేస్తున్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికులకు ఐదు లక్షల నుండి పది లక్షల వరకు ఇస్తామన్న ఎక్స్ గ్రేషియా అమలు చేయాలని, 14 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, పెన్షన్ రు.4000 కు పెంచాలని అట్లాగే నీరా మరియు తాటి ఈత ఉత్పత్తులను అభివృద్ధి చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, ఈ బడ్జెట్లో 5000 కోట్ల రూపాయలు కేటాయించడానికి ముఖ్యమంత్రి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు చేసే పోరాటాలకు పూర్తిగా మద్దతునిస్తూ అవసరమైతే ప్రత్యక్ష పోరాటాలకు కూడా సిపిఎం పార్టీ సిద్ధమవుతుందని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు.
