జాతీయ సదస్సులో ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్.
అగ్రరాజ్యంతో ఒప్పందం దేశంలోని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వక్తలు.
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక బ్యూరో):అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రతిబింబమే ట్రంప్ చర్యలు అని ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అందరూ పిచ్చివాడిగా అభివర్ణిస్తున్నారు.అయితే ఆ వాదన నిజమే అయినప్పటికీ,ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి కేంద్రమైన అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తెలుపుతుందన్నారు. సోమవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్ లో సిఐటియు,ఎఐకెఎస్, ఎఐఎడబ్ల్యుయు సంఘాల సంయుక్తంగా ‘అమెరికా వాణిజ్య ఒప్పందం,అసమాన అసమాన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు,దేశ ప్రజలు’ అనే అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాతో భారతదేశం చేసుకున్న వాణిజ్య ఒప్పందం అసమాన ఒప్పందమని అన్నారు.
”ఈ ఒప్పందాన్ని మూడు ప్రధాన కారణాల వల్ల అసమానంగా వర్ణిస్తున్నాను. మొదటి కారణం ఏమిటంటే, చమురును రష్యా నుండి కొనుగోలు చేయకూడదని,యుఎస్ఎ నుండి మాత్రమే కొనుగోలు చేయాలని అది చెబుతోంది.రెండో కారణం ఏమిటంటే, యుఎస్ నుండి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల (100 బిలియన్ డాలర్ల) విలువైన వస్తువులను ఇండియా కొనుగోలు చేయాలని అది చెబుతోంది. ప్రస్తుతం భారతదేశం అమెరికా నుండి రూ.3.63 లక్షల కోట్ల (40 బిలియన్ డాలర్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది.దీనిని 9 లక్షల కోట్లకు పెంచాలని ట్రంప్ డిమాండ్ చేశారు.ఒప్పందం అసమానమని నిరూపించే మూడో కారణం ఏమిటంటే, అమెరికా ఉత్పత్తులపై సున్నా శాతం సుంకం,భారతీయ ఉత్పత్తులపై 18 శాతం ఉంటుంది.అందుకే ఈ ఒప్పందం దేశ వ్యతిరేకమైనదని అంటున్నాను”అని ప్రభాత్ పట్నాయక్ అన్నారు.
ఇప్పటికే సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలతో దేశం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని,తాజాగా వాణిజ్యం ఒప్పందంతో దేశంలోని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని విమర్శించారు.తయారీ,వ్యవసాయ రంగాల సార్వభౌమాధికారం పోతుందని అన్నారు.ఈ ఒప్పందాలు లక్షలాది మంది కార్మికులు,రైతులు, శ్రమించే ప్రజల జీవనోపాధిని తీవ్ర ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ”సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు” తలొగ్గిందని తెలిపారు.జెఎన్‌యు మాజీ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధర్ మాట్లాడుతూ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలతో ఇండియా జరిగే ప్రయోజనం ఏమీ లేదని,ఆ ఒప్పందాలతో అమెరికాకు మాత్రమే ప్రయోజనమని అన్నారు.
పైగా ఆ ఒప్పందాల ప్రభావం దేశంలోని కార్మికులు,రైతులపై ఉంటుందని తెలిపారు.సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందం అమెరికా ప్రకటనల ద్వారానే ఇండియా-యుఎస్ ఒప్పందాల బయటకు వస్తున్నాయని,ఇది దేశానికి అవమానమని,ప్రజలకు ద్రోహం చేయడమని విమర్శించారు.మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకుంటున్న ట్రేడ్ ఒప్పందాల వివరాలను ఇప్పటివరకు పార్లమెంట్‌కు గానీ,దేశ ప్రజలకు గానీ తెలియజేయలేదని విమర్శించారు.ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశ వ్యవసాయాన్ని అమెరికా అగ్రో,కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నమని విమర్శించారు.రైతుల జీవనాధారాలపై దాడి అని,దేశీయ పరిశ్రమలు,ఉపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. జాతీయ విదేశీ విధాన స్వతంత్రత,భద్రతపై ముప్పు తప్పదని హెచ్చరించారు. ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ అమెరికా ఒప్పందాలతో వ్యవసాయ కార్మికుల జీవనోపాధిపై దాడి జరుగుతుందని అన్నారు.
ఈ ఒప్పందాలపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడం,అమెరికా ప్రభుత్వ ప్రకటనల ద్వారానే దేశానికి విషయం తెలిసే పరిస్థితి ఏర్పడటం దేశాన్ని అవమానపరచడమే కాక ప్రజాస్వామ్యానికి తీవ్రమైన హాని అని పేర్కొన్నారు.
