స్వచ్ఛంద కార్యక్రమాలతో ప్రజల ముందుకు.
తమ్ముడు ‘ బీర్ల ‘ అండతో పెరిగిన ఆదరణ.
‘స్థానిక ‘ సమరానికి సిద్ధమవుతున్న బీర్ల శంకర్.
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆయనకు బాల్యంలో ఎదురైన పేదరికం ఉన్నత స్థాయికి ఎదగాలనే కసిని పెంచింది. సమస్యలు స్వాగతం పలుకుతూ, అవమానాలు తారసపడుతున్నా బతుకు పోరాటం ఆపలేదు. ఒక వైపు కుటుంబానికి ‘ ఆర్థిక ‘ తోడ్పాటును అందిస్తూనే, మరో వైపు ‘ అక్షర ‘ ( ఉన్నత విద్య ) యజ్ఞం చేశారాయన. ఇక్కడితో ఆగకుండా, నూనూగు మీసాల వయసులోనే విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించి సమస్యలపై పిడికిలి బిగించారు. గ్రామీణ బడుగు జనాల్లో చైతన్యం నింపారు. ఇలా రెండు దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాలు చేసిన ఆయన, కుటుంబ బాధ్యతల దృష్ట్యా కాస్త విరామం తీసుకొని, తన తమ్ముడిని రాజకీయాల్లోకి ప్రవేశింపజేసి.. ఉన్నతికి మనస్పూర్తిగా సహకారం అందించారు. అనంతరం రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారాయన. ఐదేండ్లు సుపరిపాలన అందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన తమ్ముడి గెలుపు కోసం తెర వెనుక చక్రం తిప్పి సఫలీకృతమయ్యారు. ఇలా ‘ ఇంట గెలిచి.. రచ్చ గెలవాలి ‘ అనే సామెతను ఒంటపట్టించుకున్న అతనే సైదాపురం మాజీ సర్పంచ్ బీర్ల శంకర్. ఇప్పుడు ప్రజా సేవే పరమావధిగా ఆయన ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సొంత సోదరుడే (అన్న) ఈ ‘ బీర్ల శంకర్ ‘.
శ్రమనే ఆయుధంగా మలుచుకొని
యాదగిరిగుట్ట మండల కేంద్రానికి సమీపంలోని సైదాపురం గ్రామంలో బీర్ల బుచ్చమ్మ – సోమరాజు దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు బీర్ల శంకర్ కాగా, చిన్న కుమారుడు బీర్ల అయిలయ్య. తండ్రి సోమరాజు మరణంతో కుమారుల ఆలనాపాలనా అంతా బుచ్చమ్మనే చూసుకునేది. బాల్య దశలోనే తల్లి కష్టాన్ని గమనించిన కుమారులిద్దరూ బాధ్యతాయుతంగా మెదులుకున్నారు. వివిధ పనులు చేసుకుంటూనే ఉన్నత విద్యను అభ్యసించారు. ఇంటికి పెద్దవాడిగా శంకర్ సమర్ధవంతమైన పాత్ర పోషించారు. కాస్త ఆర్థికంగా నిలదొక్కుకున్నాక సోదరులిద్దరూ సైదాపురం గ్రామానికి సర్పంచ్ లు గా వ్యవహరించడం విశేషం.
విద్యార్థి దశ నుండే ఉద్యమాలు
విద్యార్థి దశలోనే బీర్ల శంకర్ రాజకీయ ఆరంగేట్రం చేశారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముఖ్య అనుచరుడిగా ఉంటూ టీఎన్ఎస్ఎఫ్ లో కీలక భూమిక పోషించారు. గ్రామీణ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పై ఉద్యమించి, పరిష్కారం చూపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు ఉపాధి కల్పించేందుకు రాయితీల పై రుణాలు మంజూరు చేయించారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) కోర్సును పూర్తి చేసిన బీర్ల శంకర్.. గ్రామాల్లోని బలహీన వర్గాలకు రాజకీయ పాఠాలు నేర్పారు.
ఉద్యోగంలోనూ ఉన్నతంగా
యుక్త వయసులో పేపర్ బాయ్ గా పని చేసిన బీర్ల శంకర్ సమాజాన్ని నిశితంగా పరిశీలించారు. ఆర్థికంగా ఎదిగి సమాజానికి తనవంతు సహకారం అందించాలని ఆనాడే సంకల్పించారు. కుటుంబ బాధ్యతలను మోస్తూ పలు రకాల ఉపాధి పనుల్లో కొనసాగారు. ఎల్ఐసీ సంస్థలో అడ్వైజర్ గా ప్రవేశించి, రెండున్నర దశాబ్దాల పాటు అత్యత్తమ ప్రతిభను కనబరుస్తూ ఉన్నత స్థాయి హోదాకు చేరుకున్నారు. ఈ దశలోనే తన సోదరుడి రాజకీయ ఎదుగుదలకు అండగా నిలిచారు.
గ్రామాభివృద్ధి పై ‘ బీర్ల ‘ సంతకం
స్వగ్రామం సైదాపురం సమగ్రాభివృద్ధి పై ‘ బీర్ల సోదరులు ‘ చేసిన సంతకం చెరపలేనిది. ఆనాడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గ్రామానికి ఆహ్వానించి రూ. కోట్ల నిధులు మంజూరు చేయించడంలో నాటి సర్పంచ్ బీర్ల అయిలయ్య పాత్ర అత్యంత కీలకం. కాస్త విరామం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చిన బీర్ల శంకర్.. సైదాపురం సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలో లేనప్పటికీ పరిపాలనలో తన మార్క్ చూపారు. రూ. కోట్లు విలువ చేసే భూములను కాపాడారు. సదరు భూములను గ్రామ ప్రజల ఉమ్మడి సౌకర్యాల కోసం వినియోగించేలా చొరవ చూపారు. ప్రజా భద్రతను కాంక్షిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. గతంలో నీటి సంఘం చైర్మన్ గా పని చేసిన అనుభవం కలిగిన ఆయన మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసి ఉత్తమ గ్రామ పంచాయితీగా ప్రశంసలు పొందారు. కరోనా కష్ట కాలంలో ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి భరోసానిచ్చారు. సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పని చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి పెండింగ్ బిల్లులు మంజూరు చేయించడంలో ముఖ్య పాత్ర పోషించారు. నిరుపేదలకు తనవంతుగా ఆర్థిక సహకారం అందిస్తున్నారు.
స్వచ్ఛంద కార్యక్రమాలతో ప్రజల చెంతకు
సంపాదనలో కొంత భాగం సమాజం కోసం వెచ్చించాలని నిర్ణయించుకన్నారు బీర్ల శంకర్. చీకటి ఇంటికి ‘ విద్య ‘ అనే దీపమే వెలుగునిస్తుందని నమ్మిన ఆయన ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై దృష్టి సారించారు. పొరుగు గ్రామాల్లో విద్యనభ్యసించేందుకు కాలి నడకన వెళ్తున్న విద్యార్థినీలకు బ్రాండెడ్ సైకిళ్లను అందజేస్తున్నారు. షూస్, స్టడీ చైర్లను కూడా అందించారు. ప్రతిభ గల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.ఇక, వాహనదారులకు రహదారి ప్రమాదాలను వివరిస్తూ ఉచితంగా హెల్మెంట్లను పంపిణీ చేశారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక తోడ్పాటునిస్తున్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.
స్థానికి సమరానికి ‘ సై ‘ అంటూ
ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు రానున్న ‘ స్థానిక ‘ ఎన్నికలో పోటీకి సిద్ధమయ్యారు బీర్ల శంకర్. రిజర్వేషన్ అనుకూలతను అంచనా వేస్తూ ఇప్పటికే పలు మండలాలపై ఆయన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తొలుత జడ్పీటీసీ గా గెలిచి, తర్వాత జడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకునే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెట్టినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ మొదలుకొని నేటి యాదాద్రి జిల్లా వరకు చైర్మన్ ఎన్నిక అంశంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని, అత్యధిక మండలాలు కలిగిన ఆలేరు నియోజకవర్గం నిరాదరణకు గురైందనే చర్చ కొనసాగుతుంది. రిజర్వేషన్ల కేటాయింపుల్లో మార్పులు తలెత్తితే తన సతీమణి శివాణిని రంగంలోకి దింపేందుకు బీర్ల శంకర్ సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. అంటే, తమ్ముడి గెలుపులో తెర వెనుక చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శంకర్ శ్రమించారు.
మాధవ సేవే.. మానవ సేవ : బీర్ల శంకర్
మాధవ సేవే.. మానవ సేవగా భావించి ముందుకు సాగుతున్నాము. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాల రూపకల్పన చేశాం. కష్టం విలువ తెలిసిన వాడిని, అందుకే ప్రజా సేవే ఎజెండాగా భవిష్యత్ జీవితం కొనసాగిస్తాను. సోదరుడి అండ (విప్ అయిలయ్య) తో పాటు సబ్బండ వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రజాశీస్సులు ఉంటాయని విశ్వసిస్తున్నాను.



