Breaking News

డిజిటల్ అరెస్ట్’ ఉచ్చు.. మాజీ బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.1.44 కోట్లు దోచిన సైబర్ కేటుగాళ్లు

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 76 ఏళ్ల వయసున్న మాజీ బ్యాంక్ మేనేజర్‌ను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు వీడియో కాల్స్, బెదిరింపులతో ఏకంగా రూ.1.44 కోట్లు దోచుకెళ్లారు. బాధితుడికి జనవరి 17న తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తమను ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులమని చెప్పిన మోసగాళ్లు, ఆయన ఆధార్ వివరాలు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో ఉపయోగించబడ్డాయని భయపెట్టారు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, వెంటనే సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

‘డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారు’ అంటూ వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు నటించి, కేసు నుంచి బయటపడాలంటే తాము సూచించిన ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 19 మధ్య మొత్తం 13 విడతల్లో రూ.1.44 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.డబ్బు చెల్లిస్తే కేసు నుంచి పేరు తొలగించి మొత్తం రీఫండ్ చేస్తామని నమ్మబలికారు. నకిలీ అండర్‌టేకింగ్‌పై సంతకం చేయించి, కుటుంబ సభ్యులకు విషయం చెప్పొద్దని కూడా హెచ్చరించారు. అనంతరం మరో రూ.17 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు కుటుంబ సభ్యులతో చర్చించి పోలీసులను ఆశ్రయించాడు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సైబర్ పోలీసులు హెచ్చరిస్తూ… ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా డబ్బులు అడగదని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *