Breaking News

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. గిడ్డంగుల్లో నిలిచిపోయిన భారత బాస్మతి బియ్యం

నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు పంపాల్సిన బాస్మతి బియ్యం భారీగా నిలిచిపోవడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని నయా బజార్ గిడ్డంగుల్లోనే సుమారు 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం నిల్వలు పేరుకుపోయినట్లు ఎగుమతిదారులు తెలిపారు.యుద్ధ పరిస్థితుల కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా అంతరాయం ఏర్పడింది. కొన్ని సరుకులు సముద్రంలోనే చిక్కుకుపోగా, మరికొన్ని ఓడరేవుల్లోనే నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు దాదాపు నిలిచిపోవడంతో గిడ్డంగుల్లో నిల్వలు పెరుగుతున్నాయి. ఇరాన్ మాత్రమే కాకుండా ఇరాక్, బెహ్రెయిన్, కువైట్, ఖతర్ వంటి దేశాల మార్కెట్లు కూడా ఈ పరిస్థితులతో ప్రభావితమయ్యాయి.

ధరలు పడిపోయిన బాస్మతి

ఫిబ్రవరిలో డిమాండ్ పెరగడంతో బాస్మతి ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెరిగాయి. అయితే యుద్ధ పరిస్థితులు మొదలైన తరువాత మార్కెట్ క్షీణించింది. గత నాలుగు రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దాదాపు 10 శాతం వరకు పడిపోయాయి. దేశీయ మార్కెట్లో కూడా 5 నుంచి 6 శాతం వరకు ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.అమెరికా ఆంక్షల ముప్పు కారణంగా ఇరాన్ నుంచి చెల్లింపులు పొందడంపై కూడా అనిశ్చితి నెలకొంది. అదనంగా వాణిజ్య నౌకలకు బీమా కవరేజ్ పొందడం కష్టంగా మారడంతో సరుకు రవాణా మరింత మందగించింది.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. భారత్ సంతాపం వ్యక్తం

గల్ఫ్ మార్కెట్లపై ఆధారపడిన ఎగుమతులు

భారత బాస్మతి బియ్యం ప్రధానంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పండుతుంది. దేశం మొత్తం బాస్మతి ఎగుమతుల్లో దాదాపు 70 శాతం గల్ఫ్ దేశాలకు వెళ్తుంది. అందులో ఇరాన్ ఒక్కటే సుమారు 25 శాతం వాటా కలిగి ఉంది.2024–25 సంవత్సరంలో భారత్ ఇరాన్‌కు రూ.6,374 కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఎగుమతి చేసింది. ఇప్పుడు ఈ కీలక మార్కెట్ అకస్మాత్తుగా నిలిచిపోవడంతో రైతుల ఆదాయం, ఎగుమతిదారుల వ్యాపారం, దేశ వ్యవసాయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి రాకపోతే బాస్మతి రంగం దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశముందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

రామ మందిరంతో అయోధ్య ఆర్థికంగా దూసుకుపోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *