అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు మరో శుభవార్త అందించింది ప్రభుత్వం. ఇప్పటివరకు పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఉన్న అన్న క్యాంటీన్లను త్వరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించనుంది. ఉగాది రోజున కొత్తగా 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 205 అన్న క్యాంటీన్లు పనిచేస్తుండగా, వీటి ద్వారా కోట్లాది మంది ప్రజలు తక్కువ ధరకు భోజనం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా రూ.5కే నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తోంది. టిఫిన్, లంచ్, డిన్నర్ తక్కువ ధరలో అందించడం వల్ల రోజువారీ కూలీలు, పేద ప్రజలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.
అసెంబ్లీలో మంత్రి పొంగూరు నారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉగాది నాటికి మండల కేంద్రాల్లో కొత్త క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.ప్రస్తుతం ఉన్న అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు 3.07 కోట్ల మంది బ్రేక్‌ఫాస్ట్, 3.64 కోట్ల మంది భోజనం, 1.59 కోట్ల మంది డిన్నర్ చేశారు. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో మరింత మంది ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ఇక ఈ పథకాన్ని మొదటగా ఎన్.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. అనంతరం మధ్యలో నిలిచిపోయిన ఈ పథకాన్ని 2024లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించింది.
