మార్చి 06 (నేటి తెలుగు పత్రిక ): ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు పరీక్షా రోజుల్లో APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా ప్రత్యేక సౌకర్యం కల్పించింది.విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. రాష్ట్రవ్యాప్తంగా APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సౌకర్యం మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే SSC పరీక్షల కాలంలో అమల్లో ఉంటుంది.ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.42 లక్షల మంది విద్యార్థులు SSC పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సులభంగా చేరుకునేందుకు తగిన సంఖ్యలో బస్సులు నడపాలని అధికారులు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే పరీక్షల రోజుల్లో విద్యార్థుల నుంచి బస్ పాస్ అడగవద్దని, హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని బస్సు సిబ్బందికి సూచించారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని APSRTC అధికారులు తెలిపారు.
