ప్రకటనల ద్వారా సాక్షి సంక్షేమం కోసం వందల కోట్ల లబ్ధి చేకూర్చాడు
• జగన్ చేసిన అప్పులతో ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం పడుతుంది
• జగన్ ఆర్థిక విధ్వంసానికి కాగ్ నివేదికే సాక్ష్యం
ఎన్టీఆర్ భవన్, మంగళగిరి,mar 10, నేటి తెలుగు పత్రిక: సొంత కంపెనీలకు లబ్ది చేకూర్చడమే పనిగా జగన్ ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి గారు విమర్శించారు. సిమెంట్ లో భారతి సిమెంట్‌కు… ప్రకటనల ద్వారా సాక్షికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా జగన్ పని చేశాడని ఆరోపించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో మాట్లాడిన ఆయన.. భారతీ సిమెంట్ కు లబ్ధి చేకూరే విధంగా సిమెంట్ ధర రూ.3 పెంచి సుమారు రూ.165 కోట్లు ప్రజలపై భారం వేశాడని మండిపడ్డారు. దీంతో భారతీ సిమెంట్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందన్నారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ఇంట్లో ఉంటూ రాష్ట్ర ఆర్థిక రంగంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగం కల్పించిన అన్ని అవకాశాలను జగన్ వదిలి వేసి.. ఇవాళ ప్రభుత్వంపై ఒకటే పనిగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ ఆర్థిక విధ్వంసానికి కాగ్ నివేదికే సాక్ష్యం
“చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఇవాళ రాష్ట్ర ప్రజలు 164 సీట్లు అప్పగించారు. ఆ నమ్మకంతోనే కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోంది. వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో సుమారు 9.70లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ అప్పు కూటమి ప్రభుత్వం చేసినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 81వేల కోట్లు ప్రభుత్వం అప్పు తీసుకుందని కాగ్ నివేదిక ఇస్తే.. వైసీపీ రూ.87 వేల కోట్లుగా ప్రచారం చేస్తుంది. ఆ ఏడాదిలో వైసీపీ మూడేళ్లు అధికారంలో ఉంది. తొలి మూడు నెలల్లో రూ.27,025కోట్లు అప్పు చేసింది. ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల్లో రూ.53వేల కోట్లు అప్పు చేసింది. జగన్ చేసిన ఆ అప్పులతో ఆస్తులు కూడా సమకూర్చ లేదు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత మూలధనం వ్యయంపై సుమారు రూ.16వేల కోట్లు ఖర్చు పెట్టి ఆస్తులను సృష్టిస్తున్నాం. భవిష్యత్ తరాలకు అప్పులే కాకుండా ఆస్తులను సృష్టిస్తున్నాం. వైసీపీ బాధ్యత రహిత పరిపాలనతో బ్యాంక్ లు అప్పులు ఇవ్వడం మానేశాయి. పెట్టుబడులు దారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. అటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాజీ పడటం లేదు. తొలి ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగస్థులకు రూ.20వేల కోట్లు చెల్లించాం. ప్రతీ నెల మొదటి తేదీకే జీతాలు చెల్లిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మరల రాష్ట్రంలో విశ్వసనీయత పెరిగింది. జగన్ హయంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎన్నికల హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నాం. 20 పాలసీలు తీసుకొచ్చి పారిశ్రామిక వేత్తలను ఆకర్షించాం. ఈ ఇరవై నెలల్లో సుమారు రూ. 8లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. సుమారు 6.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం.”
గతంతో పోల్చితే సంక్షేమానికి 45శాతం అధికం ఖర్చు చేస్తున్నాం
“జగన్ హయంలో ఐదేళ్లలో అమ్మ ఒడి పథకానికి రూ. 26వేల కోట్లు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. సామాజిక పింఛన్లు కోసం జగన్ రూ.58,500 కోట్లు ఖర్చు చేస్తే.. కేవలం ఇరవై నెలల్లోనే రూ.58,654 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు జగన్ ఐదేళ్లలో రూ. 14 వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఒక్క సంవత్సరంలో రూ. 6300 కోట్లు ఇచ్చాం. గతంతో పోల్చితే 45శాతం వరకు అదనపు నిధులు ఇస్తున్నాం. కేంద్ర పథకాలైనా అమృత్ , జల్ జీవన్ మిషన్ పథకాలకు రాష్ట్రం నుంచి డబ్బులు ఇవ్వకుండా వాటిని వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక దిశానిర్దేశం లేని పథకాలను అమలు చేసి ప్రజలను మోసం చేశాడు. సంవత్సరానికి లక్షల సంఖ్యలో నిరుద్యోగులు బయటకు వస్తున్నారు. వారికి ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. నేడు కూటమి ప్రభుత్వంలో యువతకు ఒక భరోసా ఇస్తున్నాం. అనేక మందికి నైపుణ్య శిక్షణ కల్పించి ఉద్యోగాలు ఇస్తున్నాం. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, డొక్కా సీతమ్మ పథకం ద్వారా నాణ్యమైన రుచికరమైన భోజనం ఇస్తున్నాం.”
జగన్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి అప్పులు చేస్తున్నాం
“పంచాయతీ గ్రాంట్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలను జగన్ పక్కదారి పట్టించారు. జగన్ హయంలో సర్పంచ్ లు అధికారాలు తీసి ఇంట్లో కూర్చొబెట్టారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. జగన్ హయంలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడైనా వచ్చిందా..? సాక్షి పత్రిక, టీవీలో నచ్చిన వారిని కూర్చొబెట్టి అసత్య వార్తలను ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. చివరికి అన్నం పెట్టే రైతులను మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. బాధ్యత రహితంగా వ్యవహరించి రైతులకు రూ.1600 కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయారు. వైసీపీ హయంలో ధాన్యం అమ్మిన ఆరు నెలలు వరకు డబ్బులు జమా అయ్యేవి కావు. నేడు 24 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులు జమా చేస్తున్నాం. జగన్ ఐదేళ్లలో సుమారు రూ. 9.74 కోట్లు అప్పులు వారసత్వంగా ఇచ్చాడు. వాటి అసలు, వడ్డీ చెల్లించడానికే రూ.71,800 కోట్లు చెల్లించాల్సిన వస్తుంది. పోలవరం, అమరావతి ప్రాజెక్టును నాశనం చేశాడు. చింతలపూడి, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తే లక్షల రైతులు బాగుపడేవారు.”
సొంత కంపెనీల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన జగన్
“రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చి మార్గాలను వదిలేసిన జగన్.. తన ఆదాయానికి ఏ మాత్రం డోకా చేయలేదు. భారతీ సిమెంట్ కు లబ్ధి చేకూర్చారు. సిమెంట్ ధర రూ.3 పెంచి రూ.165 కోట్లు ప్రజలపై భారం వేశారు. సుమారు భారతీ సిమెంట్ సామర్థ్యం మూడు రెట్లు పెంచాడు. సాక్షికి పత్రికకు ప్రకటన రూపంలో రూ.400 కోట్లు ఇచ్చారు. ప్రత్యేక జీవోలు తీసుకొచ్చి వాలంటీర్స్, సచివాలయ సిబ్బందికి కేవలం సాక్షి పత్రికలు మాత్రమే సరఫరా చేశాడు. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నామో.. ఆదాయ వనరులు కూడా అలానే తీసుకురావాలి. అప్పుడే రాష్ట్ర ఆర్థిక రంగం గాడిలో పడుతుంది. ఐదేళ్లు బటన్ నొక్కడమే పనిగా జగన్ పని చేశాడు. ఆదాయ వనరులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు.”
