Breaking News

కూటమి పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం

  • సంక్షేమం–అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం
  • పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం
  • మంత్రి డా.డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి

మంగళగిరి, mar 10, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమానికి నిజమైన స్వర్ణయుగం ప్రారంభమైందని మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కొద్దిమందికే పరిమితమయ్యాయని, అయితే ప్రస్తుతం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం సంక్షేమాన్ని చేరవేస్తోందని తెలిపారు. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలన కాలంలో కేవలం 15 శాతం హామీలను మాత్రమే అమలు చేసి మిగతా 85 శాతం హామీలను అమలు చేయకుండా అమలు చేసినట్లు ఊదరగొట్టుకున్నాడు. సంక్షేమం అంటే కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమంగా తయారు చేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 63 లక్షల మందికి ప్రతి నెలా రూ.2700 కోట్లకు పైగా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే సూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం హామీలను అమలు చేసి సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. అదేవిధంగా దీపం–2 పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పెద్ద సాయంగా నిలిచిందన్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఇప్పటికే రూ.14 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. దేశంలో రైతులకు ఇంత పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. విద్యారంగంలో కూడా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు.

తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం విద్యా రంగంలో విస్తృతమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని కులం, మతం, రాజకీయ పార్టీ అనే భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో పబ్లిక్–ప్రైవేట్–పీపుల్స్ పార్ట్నర్‌షిప్ (పీ4) విధానాన్ని అమలు చేస్తూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను సాధికారత దిశగా నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. పేద కుటుంబాలు ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థికంగా కష్టాల్లో పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వందల కోట్ల రూపాయలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే సంజీవని పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి గతంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను మెరుగుపరుస్తూ స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు వేతన స్కేలు, ప్రమోషన్ అవకాశాలు కల్పిస్తూ సేవల నాణ్యతను పెంచుతున్నామని చెప్పారు. అలాగే కౌశలం కార్యక్రమం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విజన్–2047 లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులను అభివృద్ధి కేంద్రాలుగా రూపొందిస్తూ పరిపాలనను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

పర్యవేక్షణ కోసం మండల, జిల్లా, పట్టణ స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. విద్యా రంగంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పలు సంస్కరణలు అమలవుతున్నాయని చెప్పారు. పాఠ్యపుస్తకాల సరళీకరణ, మెగా పేరెంట్–టీచర్ మీటింగ్స్, లీప్ మోడల్ విద్యా విధానం వంటి చర్యల ద్వారా గుణాత్మక విద్య అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర స్థాయి అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను అభినందించడం గర్వకారణమన్నారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పల్లెబాట కార్యక్రమం ద్వారా గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. పల్లెబాట–2 ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కూడా పారదర్శకత తీసుకువస్తున్నామని మంత్రి చెప్పారు. గతంలో హద్దురాళ్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపై వ్యక్తిగత ప్రచారం కోసం పేర్లు, బొమ్మలు ముద్రించిన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం రైతుల ఆస్తి హక్కులను గౌరవిస్తూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం విశాఖపట్నం ఎకనామిక్ జోన్, అమరావతి జోన్, తిరుపతి జోన్లను ఏర్పాటు చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి తెలిపారు. విశాఖపట్నాన్ని గ్లోబల్ డేటా హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. గతంలో మూతపడే పరిస్థితికి చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల దిశగా నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు.

పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *