Breaking News

మూసీ నదికి సరికొత్త రూపు.. రూ.7 వేల కోట్ల మెగా ప్రాజెక్ట్‌కు సిద్ధం తెలంగాణ

మార్చి12: (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరానికి ప్రాణాధారమైన మూసీ నది ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తొలి దశ డీపీఆర్ పూర్తవడంతో త్వరలోనే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొదటి దశలో సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో రూ.7 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి

మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, అలాగే గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు.

వరదల నివారణకు భారీ రక్షణ గోడలు

1908లో హైదరాబాద్‌ను వణికించిన ఘోర వరదల మాదిరి పరిస్థితులు మళ్లీ రాకుండా నది ఇరువైపులా భారీ రక్షణ గోడలు నిర్మించనున్నారు. లక్షన్నర క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఈ నిర్మాణాలు ఉండనున్నాయి.

మురుగు నీరు నదిలోకి రాకుండా చర్యలు

మూసీ నదిలోకి మురుగు నీరు చేరకుండా ప్రత్యేక ట్రంక్ లైన్ పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిని కొత్తగా ఏర్పాటు చేసే నాలుగు ఎస్టీపీలతో అనుసంధానం చేస్తారు. శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, పరిశ్రమలు, పచ్చదనం కోసం మళ్లీ వినియోగించేలా చర్యలు తీసుకోనున్నారు.

బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా ఎ. రేవంత్ రెడ్డి నివాళులు

పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు

నది పరిసర ప్రాంతాన్ని పచ్చిక బయళ్లుగా అభివృద్ధి చేసి ప్రజలకు విశ్రాంతి కోసం పార్కులు, పూల తోటలు, వాకింగ్ ట్రాక్‌లు, సైకిల్ ట్రాక్‌లు, పిల్లల ఆట స్థలాలు, హోటళ్ల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.

15 కొత్త వంతెనలు

మంచిరేవుల, నార్సింగి, సన్ సిటీ వంటి ప్రాంతాలను అనుసంధానించేందుకు మూసీ మరియు ఈసీ నదులపై 15 కొత్త వంతెనలు నిర్మించనున్నారు. నది ఇరువైపులా విశాలమైన రహదారులను కూడా అభివృద్ధి చేయనున్నారు.

దక్షిణ కొరియా తరహా అండర్‌గ్రౌండ్ ఎస్టీపీ

దక్షిణ కొరియా రాజధాని Seoulలోని హాన్ రివర్, చెంగ్గ్యెచియాన్ ప్రాజెక్టుల నమూనాలో భూగర్భ ఎస్టీపీ ఏర్పాటు చేయనున్నారు. పైభాగంలో పార్కులు, నీటి కొలనులు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి ప్రజలకు వినోదాన్ని కలిగించేలా ప్రణాళిక ఉంది.

గాంధీ సరోవర్ – స్టాచ్యూ ఆఫ్ పీస్

బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ కేంద్రాన్ని అభివృద్ధి చేసి, మూసీ–ఈసీ జలాలు కలిసే ప్రాంతంలో 100 మీటర్ల ఎత్తైన టవర్ నిర్మించనున్నారు. దానిపై ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది. టవర్‌లో గాంధీజీ జీవితం, చరిత్రను తెలియజేసే మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు.

గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా హైదరాబాద్.. Netflix ఐలైన్ స్టూడియో లాంచ్

భారీ మాస్టర్ ప్లాన్

మూసీ నది జంట జలాశయాల నుంచి గౌరెల్లి గ్రామం వరకు సుమారు 55 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నది ఇరువైపులా ఒక కిలోమీటరు పరిధిని కలుపుకుని మొత్తం 110.91 చ.కిలోమీటర్ల ప్రాంతానికి భారీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మూసీ నది కేవలం నీటి ప్రవాహంగా కాకుండా పర్యాటక కేంద్రంగా, వాణిజ్య హబ్‌గా మారి హైదరాబాద్ నగర అభివృద్ధికి కొత్త ఊపు తీసుకువస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *