హైదరాబాద్,మార్చి 16(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భారీ మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తోంది. ప్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం ఓడరేవు (బందర్ పోర్ట్) వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర పురోగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమమే ప్రభుత్వ పాలన లక్ష్యమని చెప్పారు. 2047 నాటికి “తెలంగాణ రైజింగ్” లక్ష్యంగా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 55 కిలోమీటర్ల మేర మూసీ నది పునరుజ్జీవన పనులు చేపడతామని తెలిపారు. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూసీ నదిలో మురుగునీరు చేరకుండా 39 ఎన్‌టీపీలు నిర్మించనున్నట్లు వెల్లడించారు.అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతీయ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ కు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. శంషాబాద్ ప్రాంతం భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ కేంద్రంగా మారుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం ద్వారా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.
