ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలి
ఏపీఈడీబీ అధికారులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం
మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి
మంగళగిరి, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పమే మన ఏకైక లక్ష్యం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా టెక్ పార్క్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యాలయం మొత్తం కలియతిరిగారు. ఈ సందర్భంగా ఏపీఈడీబీ ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తూ.. గత ప్రభుత్వం ఏపీఈడీబీని నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలి. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలి. యువగళం పాదయాత్ర సమయంలో యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాను. జీడీ నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే మోహన అనే మహిళను కలిశాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం వద్దని, తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే చాలని ఆమె చెప్పారు. కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్దఎత్తున పెట్టుబడులు సాధించాం. దేశానికి వచ్చిన వంద రూపాయల పెట్టుబడుల్లో 25 రూపాయాలు ఏపీకి వచ్చాయి. ఇందుకు ఈడీబీ బృందానికి అభినందనలు. సీఈవో సాయికాంత్ వర్మకు నా హృదయపూర్వక అభినందనలు.




ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి
గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి. ఇప్పుడు మనం మరింత స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఉద్యోగాలు కల్పించామన్నదే ముఖ్యం. రిలయన్స్ సీబీజీ ప్రాజెక్ట్ వల్ల పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. ఉద్యోగాల కల్పనే మన సింగిల్ ఎజెండాగా ఉండాలి. నూతన పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ మన ప్రధాన లక్ష్యం కావాలి. ఛాలెంజ్ గా తీసుకోవాలి. మన ఏకైక లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన అని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ మీకు కేటాయించిన క్లస్టర్‌లో నిపుణులుగా మారాలి. ఇప్పటికే సుమారు 22 క్లస్టర్లను గుర్తించాం. వర్టికల్ ఇంటిగ్రేషన్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ పై దృషి సారించాలి. ఒప్పందం కుదుర్చుకున్న ప్రతి ప్రాజెక్ట్ గ్రౌండ్ కావాలి. ప్రతి ప్రాజెక్ట్ ను సమీక్షించడం జరుగుతుంది. ఏ ప్రాజెక్ట్ ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదు. అధికారులు, సిబ్బంది ఉన్నతంగా ఆలోచించాలి. ఈ నెల 23 రెండో స్టీల్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నాం. ఇంతటితో తృప్తిపడకూడదు. ఎందుకు ఐదు స్టీల్ సిటీలు నిర్మించకూడదు? అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ చివరినాటికి ఉండవల్లి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ అందుబాటులోకి వస్తుంది. ప్రతిఒక్కరం ఎంతో కష్టపడుతున్నాం. దేశం, రాష్ట్రం, ఈడీబీ గర్వపడే విధంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ ఎమ్.అభిషిక్త్ కిషోర్ ఇతర ఉన్నతాధికారులు ఎంటీ కృష్ణబాబు, సౌరభ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు.




















