హైదరాబాద్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఫినో పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి నంద్ కిశోర్ గుప్తా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.తన అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేయాలని గుప్తా కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయన వాదనలను కోర్టు అంగీకరించలేదు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేసింది.ఈ కేసులో గుప్తా, తనపై నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ అధికారులు తీసుకున్న చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 22లను ఉల్లంఘిస్తున్నాయని ఆయన వాదించారు. అలాగే తన రిమాండ్ ఆర్డర్‌ను రద్దు చేయాలని కోరారు.
అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించడంతో గుప్తాకు తాత్కాలికంగా ఊరట లభించలేదు. ఈ నిర్ణయం కేసులో కీలక మలుపుగా మారింది.గత ఫిబ్రవరి 18న DGGI హైదరాబాద్ యూనిట్ అధికారులు ముంబైలో గుప్తాను అరెస్టు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన భారీ లావాదేవీల దర్యాప్తులో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ప్రాథమిక విచారణలో కోట్ల రూపాయల అక్రమ ట్రాన్సాక్షన్లు జరిగినట్టు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకోగా, దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
