రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన
పామర్రు (పమిడిముక్కల),ఏప్రిల్ 04(నేటి తెలుగు పత్రిక ): గ్రామాల అభివృద్ధికి కామినేని హాస్పిటల్ అందిస్తున్న చేయూత ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. శనివారం కామినేని హాస్పటల్ వారి సౌజన్యంతో రూ, 2కోట్ల నిధులతో పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణం, నూతన భవన నిర్మాణం, స్థలం మెరక అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి పాఠశాల ఆట స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించి, స్థలాన్ని మెరక చేసి విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ‘పి-4’ పేరుతో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని తెలిపారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యాభివృద్ధికి చేయూతనందిస్తున్న కామినేని హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నిధులు సద్వినియోగం కావాలంటే మాతృభూమి శ్రేయోభి సంఘం వంటి మంచి టీమ్ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థులు పరీక్షల్లో ఎలా విజయవంతం కావాలో కూడా జిల్లా కలెక్టర్ పలు మెలకువలు, సూచనలు అందించారు. అలాగే గ్రామంలో చదువులో వెనకబడిన విద్యార్థులను మాతృభూమి శ్రేయోభి సంఘం దత్తత తీసుకుని, వారిని అన్ని సబ్జెక్టుల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.పామర్రు శాసన సభ్యుడు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు దిశగా సుపరిపాలన అందిస్తోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్ ఋషిలా పనిచేస్తూ, జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపారని ప్రశంసించారు.కార్యక్రమంలో డివైఈవో పద్మారాణి, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం తులసి రాణి, కామినేని హాస్పిటల్స్ ప్రతినిధి గొంది శివరామకృష్ణ ప్రసాద్, మాతృభూమి శ్రేయోభి సంఘం అధ్యక్షుడు తాతినేని శేషగిరిరావు, తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీవో వీర్ల సీతారామరాజు, గ్రామ ప్రముఖ లు తాతినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

